మానుకోట సఖి కేంద్ర నిర్మాణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ భూములను లాక్కొని కేంద్రం నిర్మిస్తున్నారంటూ కొందరు ఆందోళనకు దిగారు. ఒక మహిళ పురుగుల మందుతీసుకుని, మరోకరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి సిద్దపడ్డారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఇద్దరిని కాపాడి.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. మహిళా సమస్యల పరిష్కారానికి మానుకోట జిల్లా కేంద్రంలో సఖి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గాయత్రిగుట్ట సమీపంలోని సర్వేనంబర్ 287/7 లోని మూడు గుంటల ప్రభుత్వం భూమిని కేటాయించింది. భవన నిర్మాణానికి గత ఏడాది అక్టోబర్‌లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ హాజరుకావాల్సి ఉంది. శంకుస్థాపనకు కొన్ని గంటల ముందు.. ఆ భూమి తమదని, సఖి కేంద్రం ఎలా నిర్మిస్తారంటూ కొందరు ఆందోళనకు దిగడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. కాగా, సఖి కేంద్ర నిర్మాణం వాయిదా పడటాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ తీవ్రంగా పరిగణించారు. వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం గుంతలు తీసే పనిని ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానిక నాయకులు పేదల భూములను లాక్కొవద్దంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు, అధికారులు వారిని పక్కకు తప్పిస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
కొండ బిక్షం అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌పోసుకుంటుండగా.. పోలీసులు వెంటనే స్పందించి పెట్రోల్ బాటిల్ లాగాసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సఖి సెంటర్ కేంద్ర గుంతలోకి దిగిన సుభద్ర పురుగుల మందు తాగేందుకు యత్నించింది. పోలీసులు అప్రమత్తమై నివారించారు. సుభ్రతతో పాటు రామచంద్రయ్య, ఉపేంద్ర తదితర ఆందోళనకారులను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.