మానకొండూర్: కొవిడ్ నియంత్రణలో ఎన్నిసార్లు విఫలమైనా ప్రభుత్వం సరైన పాఠాలు నేర్చుకోవడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ నేత మంద అమర్ అన్నారు. కొవిడ్‌ను నియంత్రించాల్సిన ప్రభుత్వం ప్రజల్ని నియంత్రిస్తూ కాలం గడుపుతోందని, అందుకే కొవిడ్ మహమ్మారి అంతం అవడం లేదని ఆయన పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతూ కొవిడ్ విజృంభించి ఏడాది ముగుస్తున్న వైద్య వ్యవస్థ అత్యంత దీన స్థితిలోనే ఉందని, ప్రభుత్వం ఆవైపుగా శ్రద్ధ పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వైద్య రంగాన్ని బలోపేతం చేస్తే ఇలాంటి సమస్యలు ఉండేవి కావని, ఒకవేళ కొవిడ్ వచ్చినా ఈపాటికి అంతం చేసే వారమని అన్నారు.
మానకొండూర్ నియోజకవర్గంతో పాటు, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని, ఒకవైపు వైద్య సదుపాయాలు లేకపోవడం మరోవైపు వ్యాధిపై అవగాహన లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అమర్ అన్నారు. అంతే కాకుండా వ్యాధితో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలని, కొవిడ్ కారణంగా అనేక మంది ఆదాయం కోల్పోయి తీవ్ర ఇబ్బుందులు పడుతున్నారని, ఆ వైపుగా ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించాలని మంద అమర్ అన్నారు