గంట‌ల కొద్దీ నిల్చూనే.. అధికారుల అత్యుత్సాహం

నిల్చూనే స‌మావేశంలో పాల్గొన్న మ‌హిళా సంఘాల స‌భ్యులు

సెర్ప్ అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. మహిళా సంఘాల సభ్యులను గంట‌ల కొద్దీ నిల్చోబెట్టారు. క‌రోనా నిబంధ‌న‌లను బేఖాత‌రు చేస్తూ.. వేలాది మందితో స‌మావేశం నిర్వ‌హించారు. సెర్ప్ అధికారుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ రోడ్డులోని ఓ పంక్ష‌న్ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి ర‌మేష్ చేతుల మీదుగా స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు రుణాల అంద‌జేత కార్య‌క్ర‌మాన్ని మంగ‌ళ‌వారం ఏర్పాటు చేశారు. ఈ చెక్కులను తీసుకునేందుకు ఒక్కొక్క సంఘానికి చెందిన అధ్యక్ష, కార్యదర్శులు మాత్ర‌మే హాజ‌రుకావాల్సి ఉంది. కానీ.. కానీ సెర్ఫ్‌ అధికారులు నేతల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. సంఘాల్లోని అందరు సభ్యులు రావాలని, లేదంటే రానివారికి ఒక్కొక్కరికి రూ.500 జరిమానాతోపాటు వచ్చిన వడ్డీ చెక్కును ఆ సంఘానికి ఇవ్వమని హుకుం జారీచేశారు. దీంతో ఒక్కొక్క సంఘంలోని సుమారు 10 మందికి పైగా ఫంక్షన్‌హాల్‌కు వచ్చారు. కొందరైతే చంటిపిల్లలను కూడా వెంట తీసుకువచ్చారు. ఉదయం 9గంటలకు సమావేశం అని అధికారులు చెబితే మహిళలు రాగా, మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1 గంటకు ప్రజాప్రతినిధులు వచ్చారు. సమావేశాన్ని తొందరగా ముగించాల్సిన సెర్ఫ్‌ అధికారులు.. ఎన్నికల సభలా మార్చేశారు.

ఫంక్షన్‌హాల్‌లో ఎక్కువమంది కావడంతో పాటు మహిళలు మాస్క్‌లు ధరించడంతో గాలి అందక మహిళలు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. వచ్చిన వారికి భోజనం కాదు కదా.. తాగడానికి నీరు కూడా లభించలేదు. దీంతో మహిళలు శాపనార్థాలు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు లేక వచ్చిన మహిళలు గోడలు పట్టుకొని ఆరుబయట మధ్యాహ్నం 2గంటల వరకు వర్షం చినుకుల్లో తడుస్తూ నిల్చుండిపోయారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *