- రాష్ట్రస్థాయిలో ద్వితీయ పురస్కారం
- దంతాలపల్లి విద్యార్థులకు కేటీఆర్ ప్రశంస
4041 పాఠశాలలు.. 23,000 విద్యార్థులు.. 7093 ఆవిష్కరణలు.. వీటిలో నుంచి మానుకోట జిల్లా దంతాలపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. స్కూల్ ఇన్నోవేషన్ చాలేంజ్ పేరుతో రాష్ట్రప్రభుత్వం, యునిసెఫ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన పోటీలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ పురస్కారం సాధించారు. గత ఏడాది కాలంగా అన్ని జిల్లాల్లో ఈ పోటీలు జరుగుతుండగా.. రాష్ట్రస్థాయి విజేతలను సోమవారం హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రకటించారు. గుర్రపు డెక్క, ఇతర సేంద్రీయ పద్ధతులో పర్యావరణ అనుకూల సానిటరీ ప్యాడ్స్ రూపొందించినందుకు యాదాద్రి జిల్లా మల్కల్ పల్లి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దిరావత్ అనిత, దిరావత్ శైలజ, బానోతు స్వాతి ప్రథమ స్థానంలో నిలిచి రూ. 75వేలు నగదు పురస్కారం సాధించగా.. మానుకోట జిల్లా దంతాలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు ఏ.అభిషేక్, సీహెచ్.వేణు, కే.రాజేష్ ఆవిష్కరణ ద్వితీయ పురస్కారం సాధించింది. రూ. 50వేల నగదు పురస్కారం కూడా అందుకున్నారు.
రైతులు పంట పొలాల్లో ఉపయోగించే బహుళ ప్రయోజన బ్యాగును రూపొందించారు. దీంతో రైతులకు శ్రమ తగ్గుతుందని, తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి దీనిని అభివృద్ది చేశామని విద్యార్థులు తెలిపారు. వీరి ఆవిష్కరణను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తల్లిదండ్రుల సమస్యకు చలించి పరిష్కారం కనుగొన్న విద్యార్థులను మంత్రి ప్రశంసించారు.