- పంజాబ్లో సీనియర్ ఐఏఎస్.. మానుకోట వాసి
- అక్కడి ప్రభుత్వంలో 30 ఏళ్లుగా కీలక పదవులు
- ప్రస్తుతం.. రోడ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు
- స్వస్థలం మానుకోట మండలం అనంతారం గ్రామం
గ్రామంలో పుట్టినా, పేదరికం అడ్డొచ్చినా అన్నిటినీ అధిగమించారు.. పట్టుదలతో ఐఏఎస్ సాధించారు.. పేరులో ఉన్నట్టే రత్నంగా మెరిసారు.. ఇది రెంటాల వెంకటరత్నం విజయగాధ. మహబూబాబాద్ మండలం అనంతారం నుంచి జాతీయస్థాయిలో సత్తా చాటిన మానుకోట ముత్యం విజయగాధ.
మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి 4 కి.మీ దూరంలోని గ్రామం అనంతారం. ఇక్కడి పురాతన వేంకటేశ్వర స్వామి ఆలయం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంతో పాటు ఇక్కడే పుట్టి పెరిగిన రెంటాల వెంకట రత్నం గురించి గ్రామవాసులు గర్వంగా చెప్పుకుంటారు. పేద రైతు కుటుంబంలో పుట్టినా తన స్వయంకృషితో ఐఏఎస్ అధికారిగా ఎదిగిన ఈయన గురించి గర్వంగా చెబుతారు. ఈయనను స్ఫూర్తిగా తీసుకుని అనంతారంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు యువకులు అనేక రంగాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారు.
రెండో ప్రయత్నంలో ఐఏఎస్
రెంటాల సంజీవరావు, రెంటాల లక్ష్మి నలుగురు మగ సంతానంలో పెద్దకుమారుడు రెంటాల వెంకటరత్నం. ఈ కుటుంబానికి వ్యవసాయమే ఆధారం. పొలంపనుల్లో తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి.. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు గర్వించేలా ఉన్నత స్థాయిలో ఉండాలని పట్టుదలతో చదివారు. పాఠశాల విద్యాభ్యాసమంతా డోర్నకల్ లో సాగింది. పదోతరగతిలో మండలంలోనే టాపర్ గా నిలవడంతో మచిలీపట్నంలోని ఓ ప్రముఖ జూనియర్ కాలేజీలో స్కాలర్ షిప్ తోపాటు సీటు సాధించారు. అనంతరం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తిచేశారు. ఎమ్మెస్సీ చదువుతూనే సివిల్ సర్విసెస్, ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. తొలి ప్రయత్నలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫీల్డ్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్ కొత్తగూడలో ఇవ్వగా.. అక్కడ 6 నెలల పాటు ఉద్యోగం చేశారు. తన జీవిత లక్ష్యం ఇది కాదని గ్రహించి సివిల్ సర్విసెస్ పరీక్షలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. తొలి ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ సాధించగా.. రెండో ప్రయత్నంలో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్నాక 1990లో పంజాబ్ కేడర్ కేటాయించారు.
- తల్లిదండ్రులు : రెంటాల సంజీవరావు, రెంటాల లక్ష్మి
- విద్యభ్యాసం : 10వ తరగతి వరకు డోర్నకల్
- ఇంటర్ : మచిలీపట్నం
- బిఎస్సీ, ఎమ్మెస్సీ : వ‌్యవసాయ వర్శిటీ హైదరాబాద్
- భార్య : వాణి
- పిల్లలు : శుభ్ర, కౌస్తుబ్
30 సంవత్సరాల్లో కీలక బాధ్యతలు..
తొలుత మోగ జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరత్నం ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించడంలో చురుకైన అధికారిగా పేరుసాధించారు. పంజాబ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 3 కోట్ల జనాభాలో అత్యధికులకు వ్యవసాయమే ఆధారం. పేద రైతు కుటుంబంలో పుట్టి పెరిగినందున అక్కడి రైతుల సమస్యలను అర్ధం చేసుకుని పరిష్కరించడంలో తన ప్రత్యేకత చాటారు. తర్వాత భటిండా జిల్లా కలెక్టర్ గానూ విజయవంతం అయ్యారు. తర్వాత రవాణశాఖ కమిషనర్ సమర్ధమంతమైన అధికారిగా పేరు సాధించారు. కమిషనర్, కలెక్టర్ స్థాయిలో విజయవంతమైన అధికారిగా పేరుసాధించడంతో పంజాబ్ ప్రభుత్వం ఆయనకు కీలకమైన శాఖలకు కేటాయించింది. ఎస్సి, బీసీ, సామాజిక భద్రత, మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ, రవాణా, కార్మిక శాఖలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం మన్ననలు అందుకున్నారు. ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి సాధించారు. జైళ్ల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉంటూ గత నవంబరు-2020లో పదవీవిరమణ చేశారు. రాష్ట్రంలో వివిధ హోదాల్లో వెంకటరత్నం చేసిన సేవలను గుర్తించిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ అనంతరం కీలకమైన పంజాబ్ స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ గా నియమించింది.
కుటుంబం గురించి..
ఇంట్లో నలుగురు కుమారుల్లో వెంకటరత్నం పెద్ద కుమారుడు. ఇద్దరు కుమారులు అనారోగ్యంతో చిన్నతనంలోనే కన్నుమూశారు. మరో కుమారుడు ప్రస్తుతం వరంగల్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు ప్రస్తుతం అనంతారం గ్రామంలోనే ఉంటున్నారు. విశాఖపట్నంకు చెందిన వాణి తో వివాహం జరిగింది. ఒక కుమార్తె శుభ్ర తండ్రి బాటలోనే సివిల్ సర్విసెస్ కు సిద్ధం అవుతోంది. కుమారుడు కౌస్తుబ్ ఇంటర్ చదువుతున్నాడు. భార్య వాణి సైతం ఉన్నత ఉద్యోగి. ప్రస్తుతం వికలాంగుల శాఖకు డైరెక్టర్ గా ఉన్నారు.