మానుకోట జిల్లా కేంద్రం శివారులో కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 30 ఫీట్ల ఎత్తుపై నిర్మిస్తున్న ఎంట్రెన్స్ సెంట్రింగ్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పకూలింది. దీంతో ఏడుగురు కూలీలు కిందపడి గాయాలపాలయ్యారు. ఘటన చోటుచేసుకున్న సమయంలో సెంట్రింగ్ కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన చందన్, సుమన్, మహారాష్ట్రకు చెందిన రాజు మహబూబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన విజయ్, మహబూబాబాద్ మండలం వేంనూరు వాసి ఆంగోతు సూక్య, కేసముద్రం మండలం ధనసరికి చెందిన బోడ నరే్‌షకు స్వల్ప గాయాలయ్యాయి. వేంనూరుకు చెందిన యాకూబ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని వెంటనే జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. కలెక్టర్ వీపీగౌతమ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కూలీలను కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పరామర్శించారు. ఈ ఘటనపై గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని కలెక్టర్ వీపీ గౌతమ్‌ను ఆదేశించారు.