ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలతో పాటు ఇతర కేంద్రప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్సు ఎగ్జామినేషన్ (జేఈఈ)-2021 పరీక్ష కేంద్రాన్ని మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఈ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఎ) నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్హతతో ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 10లక్షలకు పైగా, తెలంగాణ నుంచి దాదాపు 80వేల మంది వరకు హాజరవుతారు. ఇంతవరకు రాష్ట్రంలో ఈ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తుండగా.. మరో నాలుగు కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఎన్.టి.ఎ నిర్ణయించింది. ఇందులో నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేటతో పాటు మహబూబాబాద్ కూడా ఉంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పరీక్ష కేంద్రాల సంఖ్య 10కి చేరింది. ఈ నిర్ణయంతో మహబూబాబాద్ నుంచి జేఈఈ పరీక్ష రాసే విద్యార్థులు ఇక్కడే రాసే అవకాశం ఏర్పడింది. గతంలో వీరు పక్క జిల్లాలు వరంగల్, ఖమ్మంకు వెళ్లాల్సి వచ్చేది.