అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని వరంగల్లో వినూత్నంగా నిర్వహించారు. “అవినీతిని అంతమొందించాలి, అవినీతి నశించాలి, అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాడాలి..” లాంటి నినాదాల మధ్య అవినీతి శవయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం బుధవారం హన్మకొండలోని ప్రముఖ చరిత్రాత్మక వెయ్యిస్తంభాల ఆలయం వద్ద జరిగింది. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో అవినీతి శవయాత్రను లోక్ సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సలహాదారులు ప్రొఫెసర్ పర్చా కోదండరామారావు, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ లింగమూర్తి, జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ జెండా ఊపి ప్రారంభించారు. డప్పు వాయిద్యాలతో వినూత్నంగా ఈ అవినీతి శవయాత్ర హన్మకొండ చౌరస్తా, కాంగ్రెస్ భవన్, అశోకా జంక్షన్, పబ్లిక్ గార్డెన్ మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు సాగింది. ఎన్.సి.సి క్యాడెట్లు, వివిధ కళాశాలల విద్యార్థులు, స్థానిక యువకులు ఆసక్తితో ఈ యాత్రలో పాల్గొని అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లోక్ సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సలహాదారులు ప్రొఫెసర్ పర్చా కోదండరామారావు మాట్లాడుతూ.. సమాజానికి క్యాన్సర్ గా మారిన అవినీతికి చికిత్స చేయాల్సిన బాద్యత యువతపైనే ఉందన్నారు. ప్రజల పన్నులతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర అయ్యాక పెన్షన్, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నా.. అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులను శాశ్వతంగా డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. యువత ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకుని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ లింగమూర్తి మాట్లాడుతూ.. చైతన్యవంతమైన సమాజంతోనే అవినీతిని నిర్మూలించగలమని అన్నారు. జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టించిన పౌరులకు తమ సంస్థ ఆధ్వర్యంల రూ. 20వేల నగదు బహుమతులను అందిస్తున్నామని గుర్తుచేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ అధికారుల జీతభత్యాల వివరాలను ప్రదర్శించాలని కోరారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జ్వాల సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ ప్రతినిధులు కీత రాజ్ కుమార్, వాంకె నర్సింగరావు, బుర్ర కృష్ణమూర్తి, చంద్రమౌళి గౌడ్, ప్రకాష్, సురేందర్, ఎన్.సి.సి. క్యాడెట్లు, విద్యార్ధులు పాల్గొన్నారు.