రాష్ట్రంలో కీలకమైన చంచల్‌గూడ జైల్ సూపరింటెండెంట్ పోస్టింగ్‌కు తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోస్టింగ్ రేసులో ముగ్గురు జైల్ అధికారులు శివ కుమార్ గౌడ్, సంతోష్‌కుమార్ రాయ్, కళాసాగర్‌లు ఉన్నారు. శివకుమార్ గౌడ్ తెలంగాణవాసి. కామారెడ్డి జిల్లా పిట్లం వాస్తవ్యుడు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. సంతోష్‌కుమార్ రాయ్ విషయానికి వస్తే.. ఆయన ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. కళాసాగర్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వాసి. ఆ పోస్టింగ్ కోసం ఈ ముగ్గురు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సంతోష్‌కుమార్ రాయ్‌కు ఒక ఉన్నతాధికారి అండదండలున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జైళ్లశాఖలో ఐజీ, డీఐజీలిద్దరూ ఆంధ్రప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. వారి సాయంతో ఆ పోస్టింగ్ దక్కించుకోవాలని కళాసాగర్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో పాటు గతంలో తాను పనిచేసిన చోట తీసుకువచ్చిన పలు సంస్కరణలపై శివకుమార్ ఆశలు పెట్టుకున్నారు. ఈ ముగ్గురిలో చంచల్‌గూడ పోస్టింగ్ ఎవరిని వరిస్తుందో చూడాలి మరి. కాగా, ప్రస్తుతం శివకుమార్ గౌడ్ చర్లపల్లి ఒపెన్ ఎయిర్ జైల్‌కు, సంతోష్‌కుమార్ రాయ్ వరంగల్ కేంద్ర కారాగారానికి, కళాసాగర్ నల్లగొండ సబ్ జైల్ అధికారిగా పనిచేస్తున్నారు. త్వరలోనే వారికి స్థానచలనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో చంచల్‌గూడ జైలుకు తీవ్ర పోటీ నెలకొంది.