రెండు రోజులుగా నడిరోడ్డుపైనే లారీ! పోలీసులు ఏంచేస్తున్నట్టు!?

మానుకోట జిల్లా దంతాలపల్లి మండలం తూర్పుతండా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదానికి స్థానిక పోలీసుల అలసత్వమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా మట్టి లోడుతో ఉన్న లారీ నడిరోడ్డుపై ఆగివున్న దంతాలపల్లి పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. లారీని అక్కడినుంచి తొలగించకపోవడం వల్లే ఇద్దరి యువకులు ప్రాణాలు గాల్లో కలిశాయని పలువురు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఎరుకొండ రాంబాబు, నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెంనికి చెందిన మహేష్ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై ఆగిఉన్న లారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది.

లారీ పక్కకు తొలగించి ఉంటే!
నిత్యం అదే రహాదారిపై తమ వాహనాలతో చక్కర్లు కొట్టే పోలీసులు లారీని పక్కకు తొలగించి ఉంటే ఇద్దరి యువకులు బతికేవారని కుమ్మరికుంట్ల గ్రామస్థులు అంటున్నారు. రెండు రోజులుగా లారీ ఆగిఉంటే కనీసం రేడియంతో కూడిన సూచిక బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దంతాలపల్లి పోలీసుల నిర్లక్ష్యంపై మండల ప్రజాప్రతినిధులతో పాటు కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వారు లారీని ఎందుకు పక్కకు తొలగించలేదని ప్రశ్నించినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు దుర్మరణం చెందినా.. ఆ లారీని ఇప్పటికి రోడ్డుపై నుంచి తొలగించకపోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొంచెం ముందుకు తరలించారు.

ఆగిన పెళ్లి.. కుటుంబాల్లో విషాదఛాయలు

కుమ్మరికుంట్లకు చెందిన ఎరుకొండ రమేష్ కొడుకు సమ్మయ్య వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. ఆ పెళ్లి ఏర్పాట్లలోనే రమేష్ అన్న కొడుకు రాంబాబు నిమగ్నమయి ఉన్నాడు. ఒక పని నిమిత్తం సమీపంలోని దంతాలపల్లికి బంధువు మహేష్ తో కలిసి బైక్ పై వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొట్టారు. వారిద్దరి మరణంతో ఆదివారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఇరుకుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే రాంబాబు మరణించడాన్ని అతడి స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ స్నేహాన్ని గుర్తుచేసుకుంటు పోస్టింగ్లు పెడుతున్నారు.

1
1

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *